Sunday, May 14, 2023

దెబ్బకు ఠా..నక్క,తోడేలు ముఠా...

సుందరయ్య ఓ గొర్రెల మందను పెంచుతుండేవాడు. వాటిని మేపేందుకు రోజూ అడవికి తీసుకెళ్లేవాడు. అవి మేత మేస్తున్న సమయంలో ఖాళీగా కూర్చోకుండా.. పచ్చగడ్డిని కోసేవాడు. సాయంత్రం మందతో పాటు ఆ పచ్చగడ్డి మోపును ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ గడ్డి మోపు.. రాత్రి వేళ గొర్రెలతోపాటు పశువుల ఆకలి తీర్చేందుకు అక్కరకు వచ్చేది. ఒకరోజు అడవి. నుంచి మందను ఇంటికి తీసుకొస్తూ.. గ్రామ పొలిమేరకి చేరుకున్నాడు. అదే సమయంలో ఓ గాడిద తనను వెంబడించడం సుందరయ్య గమనించాడు. నెత్తినున్న గడ్డి మోపును చూసి, ఆ గాడిద తనవెంట వస్తుందనుకొని దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ, ఎంతకీ అది వెనకడుగు వేయలేదు. ఇక చేసేది లేక.. ఇంటికి చేరుకున్నాడు.

గడ్డి మోపు వైపు చూస్తూ ఆశగా గొర్రెల మంద దగ్గరే నిల్చుండిపోయిందా గాడిద. 'ఈ పనికిమాలిన గాడిద ఇలా నావెంట పడుతుందేంటి? అంటూ కర్రతో దాన్ని కొట్టబోయాడు. అక్కడే ఉన్న బామ్మ.. అతడిని అడ్డుకుంది. 'చూడు సుందరయ్యా.. ఈ ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ లేదు. అందులోనూ మూగజీవాలను ఆదరిస్తే, జీవితాంతం మనకు రుణపడి ఉంటాయి' అంది. 'గాడిద వల్ల మనకేం ఉపయోగం బామ్మా..?. పచ్చగడ్డి తినడానికే ఇక్కడ ఆగిందది' అని విసుక్కుంటూ సమాదానమిచ్చాడు. సుందరయ్య. 'ప్రశాంతంగా ఆలోచిస్తే.. నీకే ఏదో ఒక మార్గం కనిపిస్తుంది.. ' అందామె. 'కుక్కయితే విశ్వాసంతో ఉంటూ దొంగల పని పడుతుంది. పిల్లేమో ఎలుకలు రాకుండా చూస్తుంది. మరి ఈ గాడిద... అంటూ నసిగాడు. సుందరయ్య.

'ఈ గాడిదను ప్రతిరోజూ అడవికి తీసుకెళ్లు వచ్చిపోయే దారిలో కనిపించే ఎండు పుల్లలను ఏరి దాని వీపున వేసుకొస్తే, మనకు వంటచెరకు కొరత తీరుతుంది' అంటూ ఒక ఉపయోగాన్ని వివరించింది బామ్మ. 'నిజమే బామ్మా.. అంటూ గాడిదను పాకలోకి తోలుకెళ్లి దాని ముందు పచ్చగడ్డి వేశాడు. అప్పటికే ఆకలితో ఉన్న గాడిద క్షణం కూడా ఆలస్యం ! చేయకుండా కడుపు నింపుకొంది. ఆ వెంటనే దాన్ని అక్కడే ఉన్న ఓ కొయ్యకు కట్టేశాడు. అప్పటికే సుందరయ్య తనను పెంచుకునేందుకు సిద్ధమయ్యాడని గాడిదకు అర్థమైంది. ఆ రాత్రి గడిచింది. తెల్లవారి మందతోపాటు గాడిదనూ అడవికి తోలుకెళ్లాడు. అలా నాలుగు రోజులు గడిచాక సుందరయ్యకు మచ్చికైందది.. అప్పటినుంచి అడవికి వెళ్లివచ్చేటప్పుడు.. ముందు గొర్రెల మంద.. వెనక సుందరయ్య.. ఆ తర్వాత గాడిద నడిచేది.

ఒకరోజు అడవిలో గొర్రెల మంద, గాడిదతోపాటు. సుందరయ్య నడుస్తున్నాడు. దూరం నుంచి ఆ గొర్రెల గుంపును నక్క, తోడేలు చూశాయి. చూడగానే వాటికి నోరూరింది. 'కాపరి ఏమరుపాటుగా ఉన్నప్పుడు గొర్రె పిల్లను ఎత్తుకొచ్చి విందు చేసుకుందామా!" అని నక్కను అడిగింది తోడేలు. 'ఒకసారి నేను కూడా నీలాగే ఆశపడి, ఏమీ ఆలోచించకుండా మందకు ఎదురుగా వెళ్లా, ఓ పిల్ల గొర్రెను లాక్కొచ్చే ప్రయత్నం చేశాను. అందులో ఉన్న పొట్టేలు గమనించి, తన తలతో నన్ను బలంగా ఢీ కొట్టింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. నా పరిస్థితి. బతుకుజీవుడా అంటూ పరుగు పెట్టాను' అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది నక్క. 'నీవన్నీ తొందరపాటు పనులే. నిదానమే ప్రధానమని పెద్దలు చెప్పారు కదా.. ఒకటికి పదిసార్లు.. ఆలోచించి ఎత్తువేయాలి. గొర్రెలకు ఎదురుగా వెళ్లే పరాభవమే మిగులుతుంది' అంటూ హేళనగా మాట్లాడింది తోడేలు,

ఆ మాటలకు నక్క చిన్నబుచ్చుకుంది. 'తెలివితేటల్లో నీ అంత గడసరిని కానులే. పిల్లి నల్లదో, తెల్లదో అన్నది ముఖ్యం కాదు.. ఎలుకను పట్టిందా? లేదా? అనేదే విషయమని మా అమ్మమ్మ. చెబుతుండేది. గొర్రె పిల్లను తెచ్చి విందు ఇస్తానంటే నాకంటే. సంతోషించే వాళ్లెవరుంటారు.. నీ తెలివికి జేజేలు పలికి, నాకంటే నువ్వు ఇంకా జిత్తులమారివని అడవిలో అందరికీ చెబుతానులే... అని తోడేలుతో అంది నక్క

దాంతో తోడేలు మీసం మెలేస్తూ.. 'తెలివి ఎంత ప్రదర్శించామన్నది ముఖ్యం కాదు.. పని జరిగిందా లేదా అనేదే. ప్రధానం. నువ్వు చెట్టు చాటునే ఉండి, నా పనితనాన్ని గమనించు.. అంటూ గొప్పలు పోయింది తోడేలు, అనువైన సమయం కోసం చూసి, గొర్రెల మందకు వెనక వైపుగా  వెళ్లిందని గాడిద వెనక చేరి.. సుందరయ్యకు కనిపించకుండా. నక్కి నక్కి ఒక్కో అడుగూ వేయసాగింది. ఏదో అలికిడి కావడంతో వెనక్కి తిరిగి చూసింది గాడిద,

తన వెనకే వస్తున్న తోడేలు వైఖరి అనుమానాస్పదంగా ఉండడంతో.. స్వామిభక్తి ప్రదర్శిస్తూ వెనక కాలితో ఒక్క తన్ను తన్నింది. దాంతో తోడేలు పల్టీలు కొడుతూ నక్క ముందు ఎగిరి పడింది. ఆ శబ్దానికి సుందరయ్య ఒక్కసారిగా తిరిగి చూశాడు. విషయం అర్ధం కావడంతో.. 'ఈ గాడిద నాకు ఈ విధంగానూ ఉపయోగపడింది అనుకుంటూ దాని తలను నిమిరాడు. గాడిద కూడా అంతే చనువుతో సుందరయ్య చేతిలో ఒదిగిపోయింది. అక్కడ నక్క ముందు పడిన తోడేలు మూలుగుతూ పైకి లేచే ప్రయత్నంలో ఉంది. తోడేలు బావా.. మన తెలివి తెల్లారినట్టే. ఉంది. అప్పుడు ముందు నుంచి వెళ్లి నేను భంగపడ్డాను. ఇప్పుడు వెనక నుంచి నువ్వెళ్లి మూలుగుతూ వచ్చావు. అందుకే అంటుంటారు పెద్దలు.. ముందూ వెనకా ఆలోచించిన తర్వాతే ఏ పనైనా చేయమని.. అని నవ్వు ఆపుకొంటూ తోడేలును ఓదార్చిందా నక్క

No comments:

Post a Comment